హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన
ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనుల పరిశీలన
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, సెప్టెంబర్:

హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సతీసమేతంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రి, వర్షాల కారణంగా కట్ట కోతకు గురైన ప్రాంతాల్లో వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
పనుల్లో నాణ్యతపై ఎటువంటి లోపాలు రానీయకూడదని స్పష్టం చేసిన మంత్రి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. బతుకమ్మ పండుగను హుస్నాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఎల్లమ్మ చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. చెరువు నిండుగా ఉండటంతో కట్ట లోపలికి భారీకేడ్లు ఏర్పాటు చేయాలని, అలాగే లైటింగ్, స్టేజి, సౌండ్ సిస్టమ్, పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు. జాతీయ రహదారి నుండి ఎల్లమ్మ చెరువు వైపు వచ్చే రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూసుకోవాలని తెలిపారు.
తదుపరి స్థానిక ప్రజలతో సమావేశమై బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై సలహాలు, సూచనలు స్వీకరించారు. ప్రజలు చెప్పిన అంశాలను అధికారుల ద్వారా సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. “ఈసారి రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిశాయి. పంటలు పుష్కలంగా పండాయి. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను” అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.





