హుస్నాబాద్ లో స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
మూడు తరాల ఉద్యమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషిచేసిన తెలంగాణ గాంధీ, కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి కార్యక్రమాన్ని హుస్నాబాద్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో, హుస్నాబాద్ లోని శ్రీ శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.
జాతీయ ఉద్యమంలో స్వాతంత్ర సంగ్రామంలో, ఉప్పు సత్యాగ్రహం లో , క్విట్ ఇండియా ఉద్యమంలో, ముల్కీ నిబంధనలకు వ్యతిరేక ఉద్యమంలో, 1969లో మొదలైన తెలంగాణ తొలి దశ ఉద్యమంలో మరియు మలిదశ ఉద్యమాలలో చురుకుగా పాల్గొని తెలంగాణ జాతిని సంఘటితం చేసి ప్రజలను చైతన్య పరచాడని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు వడ్డేపల్లి వెంకటరమణ కొనియాడారు. సుమారు 17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మూడుసార్లు కేబినెట్ మంత్రిగా అపారమైన అనుభవాన్ని కలిగిన రాజకీయ దురందరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బూర్ల రాజయ్య, కోమటి సత్యనారాయణ తెలిపారు.పదవుల కన్నా తెలంగాణ సాధన ధ్యేయంగా పనిచేసిన నిజాయితీ, నిబద్ధత కలిగిన నికార్సైన రాజకీయ వేత్త బాపూజీ జీవిత చరిత్ర నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. తను సంపాదించిన మొత్తంలో 75 శాతం ప్రజల కోసమే ఖర్చు చేసిన సేవ తత్పరునీ విగ్రహ స్థాపనకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయవలసిందిగా పద్మశాలి ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల భగవాన్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కోమటి స్వర్ణలత, దూడం నాగభూషణం, వడ్డేపల్లి లక్ష్మయ్య, గుళ్లపల్లి కన్నయ్య, బూర్ల సత్యనారాయణ, చింతకింది శ్రీనివాస్, వెంకటనారాయణ, బుర్ల భాస్కర్, కనుకుంట్ల శ్రీనివాస్, వడ్డేపల్లి బాలయ్య, నరసింహస్వామి,పాము రాజన్న, రాజు, రాయమల్లు, నారాయణ, సుదర్శన్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.





