ఎల్లమ్మ చెరువు వద్ద బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై అధికారుల పర్యవేక్షణ
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

రాబోయే బతుకమ్మ పండుగ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు గురువారం పరిశీలించారు. చెరువు సుందరీకరణలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు, భద్రతా చర్యలు, విద్యుత్ సౌకర్యాలు, రహదారి మరమ్మతులు తదితర అంశాలను పరిశీలించారు. బతుకమ్మ పండుగకు మహిళలు, కుటుంబాలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన సౌకర్యాలను సమయానికి పూర్తి చేయాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా చెరువు వద్ద లైట్ల ఏర్పాటు, చెరువు చుట్టూ శుభ్రత, భద్రతా వలయాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పర్యవేక్షించారు. మహిళలు, పిల్లలు సురక్షితంగా పండుగలో పాల్గొనేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని RDO రామ్మూర్తి ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ టీ. మల్లికార్జున్ మాట్లాడుతూ, పండుగకు వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ పర్యటనలో RDO రామ్మూర్తి, ఏసిపి సదానందం, మున్సిపల్ కమిషనర్ టీ. మల్లికార్జున్, విద్యుత్ శాఖ AD, AE, సిఐ శ్రీనివాస్, ఎస్సై లక్ష్మారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.





