పేదలకు భూములు పంచిన ఘనత కమ్యూనిస్టులదే
సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
భూమి,భుక్తి,విముక్తి కోసం దున్నేవానికి భూమి కావాలని, వెట్టి చాకిరిని మట్టు పెట్టాలని సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కుల, మతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా సాగించిన పోరాటమని ఈ పోరాటాన్ని మతోన్మాద శక్తులు కుల మతాల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించి చరిత్రను వక్రీకరిస్తున్నారని ఇలాంటి మతోన్మాద శక్తులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవలో భాగంగా బుధవారం రోజున హుస్నాబాద్ పట్టణంలో తెలంగాణ రైతంగా సాయుధ పోరాట యోధుడు అనబేరి ప్రభాకర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి హాజరైన సీపీఎం జిల్లా కార్యదర్శి రాళ్ల బండి శశిధర్ మాట్లాడుతూ ఆనాడు నైజాం రజాకార్లు భూస్వాములు దొరలు జాగిర్దారులు దేశ్ముఖ్ లకు వ్యతిరేకంగా పీడనకు దోపిడీకి గురవుతున్న ప్రజలందరినీ ఐక్యం చేసి పది లక్షల ఎకరాల భూములు పంచిన, 4000 మంది ప్రాణాలర్పించి ప్రజలను రక్షించిన చరిత్ర కమ్యూనిస్టులదన్నారు.ఆనాటి చరిత్రకు ఏమాత్రం సంబంధంలేని మతోన్మాద శక్తులు నేడు మేము ఆ పోరాటానికి వారసులమని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రజలకు అనేక హక్కులు కల్పించిందని ప్రజలు ఆత్మగౌరవంతో తలెత్తుకొనే విధంగా అయ్యా బాంచన్ అనే బక్కోడిని నిటారుగా నిలబెట్టిన పోరాటం అన్నారు.ఆ పోరాట ఫలితంగానే భూసంస్కరణ చట్టం అమల్లోకి వచ్చిందని దానివల్ల పేదల చేతుల్లో భూములు ఉన్నాయని తెలిపారు.అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసిన వర్గ పోరాటం అన్నారు.నేడు పాలకులు నాటి భూ సమస్యను ఇంకా పరిష్కారం చేయడం లేదని ఇప్పటికీ లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు వ్యవసాయానికి, నివాసానికి యోగ్యంగా ఉన్నాయని వాటిని పేదలకు పంచడంలో పాలకవర్గాలు పూర్తిగా వైపల్యం చెందాయన్నారు.నాటి అమరవీరుల స్ఫూర్తితో బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్,శెట్టిపల్లి సత్తిరెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు వెంకట మావో,రవికుమార్, తిప్పారపు శ్రీనివాస్,నాయకులు గూగులోతు శివరాజ్,నాగరాజు, కల్లుగీత సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ కొమురయ్య,బానోతు రాజు నాయక్, సాయి,చరణ్,గిరిధర్ రావు,బాబీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Posted inహుస్నాబాద్
పేదలకు భూములు పంచిన ఘనత కమ్యూనిస్టులదే





