ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు
బిజెపి పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పట్టణంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవాన్ని బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాస్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేశారు.
ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రక్తదాన శిబిరంలో జేఎస్ఆర్, బత్తుల శంకర్ బాబుతో పాటు 103 మంది రక్తదాతలు రక్తదానం చేశారు. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులకు జేఎస్ఆర్ శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ – “మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. 370 ఆర్టికల్ రద్దు, రామమందిర్ నిర్మాణం వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో మోదీ గారు దేశ సమస్యలను పరిష్కరించారు. ఆపరేషన్ సింధూర్ వంటి సాహసోపేత చర్యలతో ఉగ్రవాదులను ఏరిపారేశారు. దేశం కోసం నిరంతరం శ్రమించే మహానాయకుడు నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మలకు శుభాకాంక్షలు తెలియజేశారు.





