బైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాలే తెలంగాణ స్వాతంత్ర్యానికి పునాది – మంత్రి పొన్నం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

తెలంగాణ విలీనం దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా వీర బైరాన్‌పల్లి అమరవీరుల స్థూపం, చారిత్రాత్మక బురుజు వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పూజల హరికృష్ణ తదితర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగామంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “బైరాన్‌పల్లి అమరవీరులు రజాకార్ల మూకదాడులను ఎదుర్కొని ప్రాణాలు అర్పించారు. మరో జలియన్ వాలా బాగ్ లా మారిన ఈ ఊరు తెలంగాణ చరిత్రలో అక్షరాలా రక్తకలంకం. 1948 ఆగస్టు 27 అర్ధరాత్రి రజాకారుల దాడిలో 119 మంది గ్రామస్తులు బలి అయ్యారు. ఆ అమరుల రక్తంతోనే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది” అని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకుంటూ, “అమరవీరుల ఆశయాలను ప్రజాపాలన ప్రభుత్వం నెరవేర్చుతుంది. వారి స్ఫూర్తితో నీళ్లు, నిధులు, నియామకాలు, సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించి బైరాన్‌పల్లిలో అమరవీరుల స్మారకం నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. అమరవీరుల కుటుంబాలను గౌరవిస్తాం” అని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా నేతలంతా బైరాన్‌పల్లి అమరవీరులకు, తెలంగాణ పోరాట వీరులకు ఘనంగా జోహార్లు అర్పించారు.





