మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడించిన ఏబీవీపీ
స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ ఆఫీస్‌ను విద్యార్థులు ముట్టడించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ సిద్ధిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ, రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. బడ్జెట్లో నిధులు లేవంటూ నెపం వేస్తున్నప్పటికీ పండుగల సందర్భంగా వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న ₹8,300 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించకపోతే విద్యార్థులను అడుక్కునే పరిస్థితికి నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై కూడా ప్రభుత్వం మొండి వైఖరినే కొనసాగిస్తే, రాష్ట్రంలోని ప్రతి చోట మంత్రులను, ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని, అవసరమైతే తెలంగాణ ఉద్యమం తరహాలో విద్యార్థుల ఉద్యమం మళ్లీ జోరందుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాకేష్, నగర కార్యదర్శులు చరణ్, పరశురాం, జేశ్వంత్, జిల్లా హాస్టల్స్ కన్వీనర్ రాజేష్, విద్యార్థి నాయకులు రాజు, అంజి తదితరులు పాల్గొన్నారు.





