హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు టూరిజం కేంద్రంగా అభివృద్ధి.. మంత్రి పొన్నం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, సెప్టెంబర్:
హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ చెరువులో గంగమ్మకు పూలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ హైమవతితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ— “ఆనాడు కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులలో భాగంగా ఎల్లమ్మ చెరువు నిర్మించబడింది. మంచి వర్షాల కారణంగా చెరువు నిండిపోవడం ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రజలందరూ పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను,” అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని చెరువులు, కుంటలు నీటితో నిండుతున్నాయని, రైతులు నీటిని సమర్థవంతంగా వినియోగించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. అదేవిధంగా, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. “ఈ చెరువు ద్వారా డ్రింకింగ్ వాటర్ సరఫరా, సాగునీటి సౌకర్యాలు మరింత పెంచుకుంటాం,” అని మంత్రి వెల్లడించారు.





