వ్యవసాయ భూముల్లో వరద.. సాగుచేసేదేలా..?
అస్తవ్యస్తంగా మారిన ఎర్రచెరువు వరద కాలువ..
నీటిలో మునిగిన రైతుల భూములు..
మా పరిధి కాదంటూ చేతులు దులుపుకొంటున్న అధికారులు
ఆందోళనలో రైతులు.. పట్టించుకునే నాథుడు కరువు..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి, సెప్టెంబరు 11

వ్యవసాయ సాగుభూములు వరదనీటితో ముంపుకు గురవుతుంటే తాము వ్యవసాయం సాగు చేసేదేలా.. అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరిగిన చలనం లేదని, తమ పరిధి కాదంటే… తమ పరిధి కాదంటూ మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు చేతులు దులుపుకుంటున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట ఎర్ర చెరువు వరద కాలువ అక్రమ వెంచర్ నిర్మాణంతో అస్తవ్యస్తంగా మారింది. గత కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ భూములు వరద నీటిలో మునిగిపోయాయి.. దీనికి తోడు మురుగు నీరు సైతం కాలువలో చేరుతుండటంతో వ్యవసాయ భూములు సాగుకు నోచుకోవడం లేదు. గతంలో ఈ ప్రాంతంలో కూరగాయలు పండించే భూములు ప్రస్తుతం వరద నీరు, మురుగు నీరుతో అస్తవ్యస్తంగా మారింది. కోందరు అక్రమార్కుల రియల్ దందా మూలంగా వరద కాలువ ద్వంసమై నీరు పక్కదారి పట్టింది. సిద్దిపేట టైమ్స్ కదనం మేరకు కలెక్టర్ ఆదేశించగా కదిలిన అధికార యంత్రాంగం సర్వ చేపట్టి వెంచర్ రాళ్లు తొలగించి చేతులు దులుపుకున్నారు. శాశ్వత పరిష్కారం చూపలేదు. ఫలితంగా పంట పొలాలు వరద నీటితో నిండి ఉన్నాయి. ఇలా అయితే తాము సాగు చేసేదేలా అంటు రైతులు ప్రశ్నిస్తున్నారు.

రామాలయం భూములు సైతం..
సిద్దిపేట బోగేశ్వరలయం పక్కనే ఉన్న అతి పురాతనమైన రామాలయం చెందిన రెండు ఎకరాల భూమి ఈ వరద కాలువకు సమీపంలో ఉంది. ఈ భూమిని రైతులు కౌలుకు సాగు చేస్తున్నారు. ఈ భూమి కౌలుతో ఆలయానికి కొంత ఆదాయం సమకూరుతుంది. ఇక్కడ నిర్మించిన అక్రమ వెంచర్ తో వరద కాలువ ధ్వంసం అయ్యింది. ఫలితంగా ఆ భూమి లో సైతం వరదనీరుతో నిండి పోయింది. ఫలితంగా సాగుకు నోచుకోవడంలేదు.

– తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్..
వరద కాల్వ నిర్మాణంతో శాశ్వత పరిష్కారం..
ఎర్ర చెరువు వరద కాలువతో వ్యవసాయ పొలాలతో పాటు విలువైన భూములు వరద నీటి ముంపుకు గురవుతున్నాయి. పలితంగా రైతులు, పట్టాదారుడు నష్టపోతున్నారు. ఆ భూముల్లో కాలు పెట్టలేని పరిస్థితులు తలెత్తాయి. వరదనీటికి మురుగు నీరు తోడైంది. ఇక ఇబ్బందికరంగా, అస్తవ్యస్తంగా కాల్వ మారింది. దీనికి శాశ్వత పరిష్కారంగా వరద కాలువ నిర్మాణం చేపడితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
త్వరలోనే సమస్య పరిష్కారిస్తాం..
వరద నీటి కాల్వ సమస్య పరిష్కారానికి ఇప్పటికి సర్వే నిర్వహించాం. పూర్తి నివేదిక తయారు చేస్తున్నాం. ఇప్పటికే వెంచర్ ను తోలగించాం.. త్వరలోనే కాలువను సరి చేస్తాం.. కలెక్టర్ కు నివేదిక అందజేసి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తాం.






