కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా సప్లై చేయడంలో విఫలం
హుస్నాబాద్ పట్టణ బిజెపి అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
గత 11 ఏళ్లుగా లేని యూరియా కొరత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని, కేంద్ర ప్రభుత్వం సరిపడా యూరియా అందజేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కృతిమ కొరత సృష్టించి రైతులను అయోమయానికి గురి చేసిందని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు విమర్శించారు.
మంగళవారం హుస్నాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ, గత ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు రాష్ట్రానికి అవసరమైన యూరియాను కేంద్రం సమయానుసారం పంపిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 2.70 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉండగా, అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం సరఫరా చేసిందని వివరించారు. ఇంకా 80-90 వేల మెట్రిక్ టన్నులు రవాణాలో ఉన్నాయని చెప్పారు. “రైతులకు యూరియా సరిపడా లభిస్తుందని ఒక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతుంటే, మరో వైపు కాంగ్రెస్ నాయకులు కేంద్రంపై నిరసనలు తెలపడం హాస్యాస్పదం” అని శంకర్ బాబు విమర్శించారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా, కాంగ్రెస్ నేతలు యూరియా క్యూల్లో నిలబడి బాధపడుతున్న రైతులను వదిలి, మార్కెట్ యార్డులో విందులు చేసుకుంటున్నారని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేయడం కాంగ్రెస్ పార్టీ చేతకానితనానికి నిదర్శనమని పేర్కొంటూ, కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
యూరియా, డీఏపీ బస్తాలపై కేంద్రం భరిస్తున్న సబ్సిడీ వివరాలను ఆయన వెల్లడిస్తూ, “ఒక పంటకు ఒక ఎకరానికి అవసరమయ్యే ఎరువులపై మాత్రమే కేంద్రం రూ. 9316 సబ్సిడీ ఇస్తుంది. ఏడాదికి రెండు పంటలకు ఇది రూ. 18,631 అవుతుంది. ఇప్పటివరకు తెలంగాణ రైతాంగానికి 76 వేల కోట్ల సబ్సిడీని కేంద్రం అందించింది” అని తెలిపారు. అదే విధంగా ప్రతి రైతుకి సంవత్సరానికి రూ. 6,000 కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు గుర్తుచేశారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కృతిమ యూరియా కొరత సృష్టించడం మానుకొని, సజావుగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు వేల్పుల నాగార్జున్, బోడిగే వెంకటేష్, ప్రధాన కార్యదర్శి పోలోజు రాజేందర్ చారి, కార్యదర్శులు బొప్పి శెట్టి సాయిరాం, కోశాధికారి బుర్ర రాజు, సీనియర్ నాయకులు తోట సమ్మయ్య, పోలోజు రవీందర్, వరియోగుల అనంతస్వామి, నారోజు నరేష్ తదితరులు పాల్గొన్నారు.





