సిద్దిపేట జిల్లాలో గణపతి పూజ కోసం పంతులు కిడ్నాప్ !…
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్;
సిద్ధిపేట జిల్లా కోహెడలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఒక వింత ఘటన చోటు చేసుకుంది. పువ్వులు, పత్రి ఆకులు దొంగతనం చేయడం వరకే విన్నాం గాని… ఏకంగా పూజ నిర్వహించే పూజారిని (పంతులును) కిడ్నాప్ చేయడం గ్రామంలో చర్చనీయాంశమైంది.
సమాచారం ప్రకారం, కోహెడలోని ఓ వీధిలో రెండు గణేష్ మండపాలు ఏర్పాటయ్యాయి. ఇరు మండపాల నిర్వాహకులు ఒకే పూజారిని సంప్రదించగా, ఎవరి వద్ద ముందుగా పూజ జరగాలన్న అంశంపై ఇరువర్గాల మధ్య తగాదా చెలరేగింది. సాయంత్రం పూజ తమ వద్దే మొదట జరగాలని వాదనలతో వివాదం ముదరింది.
ఈ క్రమంలో ఒక గ్రూప్ అక్కడే ఉన్న పూజారిని ఎత్తుకుని బైక్పై తీసుకెళ్లింది. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న యువకులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఘటనపై స్థానికులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. కొందరు దీనిని సరదాగా తీసుకోగా, మరికొందరు ధార్మిక కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని అభిప్రాయపడుతున్నారు.





