జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి… మంత్రి వివేక్ వెంకటస్వామి
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
ఉమ్మడి మెదక్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని లేబర్, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు.
మంత్రి మాట్లాడుతూ, అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుండి బయటకు వెళ్లకూడదని సూచించారు. వరద నివారణకు సంబంధించిన తక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని సంబంధిత అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు.
ఇంజినీర్లు, పోలీస్, రెవిన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు స్థానిక స్థాయిలో ఉండి ప్రజలకు వరద పరిస్థితులపై సమయానుకూల సమాచారం అందించాల్సిన అవసరాన్ని మంత్రి స్పష్టం చేశారు.
ఈ క్రమంలో సీఏస్, డీజీపీలతో టెలిఫోన్ లైన్ ద్వారా సమీక్ష నిర్వహించినట్టు మంత్రి వివరించారు. స్థానిక సిబ్బంది, రెస్క్యూ బృందాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశించారు.
వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష కొనసాగిస్తున్నారని మంత్రి తెలిపారు. రేపు వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పర్యటించి, అక్కడి పరిస్థితులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేపడతానని వివేక్ వెంకటస్వామి ప్రకటించారు.





