హుస్నాబాద్ మున్సిపాలిటీకి పద్మశాలి పొదుపు సంఘం డెడ్ బాడీ ఫ్రీజర్ బహుకరణ
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పట్టణంలోని పద్మశాలి బంధుమిత్ర పొదుపు సంఘం సామాజిక సేవలో మరో ముందడుగు వేసింది. సుమారు ఒక లక్ష రూపాయల విలువ గల డెడ్ బాడీ ఫ్రీజర్‌ను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్‌కు సంఘ ప్రతినిధులు బహుకరించారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ — “పొదుపు చేసిన డబ్బులను విందులు, విహారయాత్రలకే కాకుండా, ప్రజలకు అవసరమైన పనుల్లో వినియోగించడం అభినందనీయం. అంత్యక్రియల సమయంలో ఉపయోగపడే ఫ్రీజర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన సంఘ సభ్యులు ప్రశంసనీయం” అని పేర్కొన్నారు.
మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ — “ఫ్రీజర్ అవసరం ఉన్న వారు ఎప్పుడైనా మున్సిపాలిటీని సంప్రదించవచ్చు. ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను” అన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు కోమటి సత్యనారాయణ, అధ్యక్షులు చిప్ప ప్రభాకర్, మండల అధ్యక్షులు బూర్ల రాజయ్య, కార్యదర్శి కొండ సతీష్, కోశాధికారి వెలదండి లక్ష్మిపతి, ఉపాధ్యక్షులు దూడం నాగభూషణం, చింతకింది శ్రీనివాస్, కొత్తకొండ స్వామి, పంతం కన్యాకుమారి, చిప్ప రాజేశం, బొడ్డు రాజేశం, వెలుదండి భాస్కర్ మరియు పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.





