గిరిజన సాంస్కృతిక వైభవానికి ప్రతీక – తీజ్ పండుగ

సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట:
సిద్దిపేట పట్టణములో తీజ్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ, గిరిజనులందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తీజ్ పండుగ గిరిజన సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. గిరిజన మహిళలు భక్తి, ఆనందంతో జరుపుకునే ఈ పండుగ సమాజంలో ఐక్యతను ప్రతిబింబిస్తుందని తెలిపారు.
వేడుకలలో భాగంగా, గిరిజన మహిళలు సంప్రదాయ గోదుమ బుట్టలు నెత్తిపై పెట్టుకొని జాటోత్ హుస్సేన్ నాయక్కి ఘన స్వాగతం పలికారు. పాటలు పాడుతూ, గిరిజన నృత్యాలు ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తీజ్ పండుగ గిరిజన గౌరవం, ఐక్యత, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలవాలని, ఈ సంప్రదాయాలను తరతరాలకు అందించి, చారిత్రక చిహ్నంగా నిలుపుదల చేయాలని జాటోత్ హుస్సేన్ నాయక్ పిలుపునిచ్చారు.
అలాగే వి మార్ట్ నుంచి బ్లాక్ ఆఫీస్, హోసింగ్ బోర్డు, పాత బస్ స్టాండ్,కోమటి చెరువు వరకు తీజ్ బుట్టలతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం కోమటి చెరువులో తీజ్ బుట్టలని నిమర్జనం చేసారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట గోర్ బంజారా అసోసియేషన్ నాయకులు సిద్దిపేట తీజ్ ఉత్సవ కమిటీ, భూక్యా బిక్షపతి నాయక్,సతీష్ నాయక్,గోపాల్ నాయక్,శంకర్ రాథోడ్, మాలోత్ జూనీ, రమేశ్ నాయక్, బంజారా ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్ధి నాయకులు తదితరులు పాల్గొన్నారు.





