ఆయిల్ ఫాం ఉత్పత్తి కి హుస్నాబాద్ కేంద్రంగా మారాలి
హుస్నాబాద్ భూముల్లో తొండలు గుడ్లు పెట్టడం కాదు బంగారం పండేలా చేద్దాం
ఆయిల్ ఫాం సాగు మరియు విస్తరణ పై అవగాహన సదస్సు లో మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:


సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోతారం ఎస్ శుభం గార్డెన్స్ లో రైతులకు ఆయిల్ ఫాం సాగు మరియు విస్తరణ పై అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరైనారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…రైతులు ఆయిల్ ఫాం సాగు పై దృష్టి సారించాలని, ఐదు ఎకరాల లోపు ఉన్న వారు మీకు నచ్చిన పంట వేసుకోండి ఐదు ఎకరాల పైన ఉన్నవారు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయిల్ ఫాం సాగు చేసి లాభాలు అర్దించాలన్నారు. వరి, పత్తి, మామిడి, మిరప ఏ పంటలు వేసిన ఇబ్బందులు వస్తున్నాయని, ఇటీవల ఋతుపవనాలు ముందు వచ్చి మార్కెట్ యార్డులో, మామిడి పంటలు వడగండ్ల వానల వల్ల, పత్తి, మొక్కజొన్న ప్రకృతి వైపరీత్యం తో అనేక పంటలకు నష్టం జరుగుతుందని, ప్రకృతి వైపరీత్యాలు, దొంగలు, కోతుల బాధలు లేకుండా పంటలు రక్షించుకునే అంశంలో ఆయిల్ ఫాం ముందుందన్నారు.
200 ఎకరాల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫాం సాగు చేస్తున్నారని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. బలవంతంగా ఆయిల్ ఫాం పెట్టమని చెప్పడం లేదని.. పెడితే లాభాలు ఉంటాయన్నారు. ఆయిల్ ఫాం ఎకరాకు 42 వేలు సబ్సిడీ నాలుగు సంవత్సరాల వరకు, నాలుగవ సంవత్సరం నుండి 60 వేల నుండి లక్షా యాభై వేల వరకు వస్తున్నాయని, ఆయిల్ ఫాం పండించిన తరువాత మార్కెటింగ్ ఇబ్బందులు లేవన్నారు. గత ప్రభుత్వం ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ తెస్తే మా ప్రభుత్వం దానిని పూర్తి చేసిందన్నారు.
రైతులకు బాగు చేయాలనే ఎజెండాగా త్వరలోనే ఫ్యాక్టరీ కూడా ప్రారంభం చేసి, హుస్నాబాద్ కేంద్రంగా ఆయిల్ కొనుగోలు చేస్తాం అన్నారు. ఆయిల్ ఫాం క్వింటాలు కు మద్దతు ధర ఏడు వేలకు పెంచామని, ప్రభాకర్ రావు అనే రైతు 20 ఎకరల్లో ఆయిల్ ఫాం వేసి ఆదర్శంగా నిలిచారని, అధిక పంట దిగుబడి వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు , హార్టికల్చర్ ,పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ అధికారులు రైతులను మోటివేట్ చేయాలని, ఖమ్మం జిల్లాకు మించి మన దగ్గర ఆయిల్ ఫాం సాగు చేయాలని, ఆయిల్ ఫాం ఉత్పత్తి కి హుస్నాబాద్ కేంద్రంగా మారాలన్నారు. ఒకసారి పంట వేస్తే 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుందని, ఆయిల్ ఫాం అత్యధికంగా మనం దిగుమతి చేసుకుంటున్నామని, దిగుమతులు తగ్గించడానికి ఆయిల్ ఫాం పంటను ప్రోత్సహించండన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల కోసం భూసేకరణ జరుగుతుందని, త్వరలోనే పూర్తి చేసి, ఈ ప్రాంతం సస్యశ్యామలం చేసి, పంటలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నదేనని, ప్రాజెక్టు విషయంలో న్యాయపరమైన అంశాలు అధిగమించి పూర్తి చేస్తామని అన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు వేసి, హుస్నాబాద్ మెట్ట ప్రాంతంలో ఆయిల్ ఫాం సాగుకు మంచి అవకాశం ఉందని, ఈ ప్రాంత రైతులకు అండగా ఉండి వ్యవసాయం లో రైతులను చైతన్యం చేద్దాం అన్నారు. హుస్నాబాద్ భూముల్లో తొండలు గుడ్లు పెట్టడం కాదు బంగారం పండేలా చేద్దాం అని అన్నారు. మార్కెట్ యార్డులో మూడు రోజుల పాటు యంత్రాల ప్రదర్శన ,సాంకేతిక అవగాహన సదస్సు జరుగుతుందని, క్షేత్ర స్థాయిలో సాంకేతిక వ్యవసాయం చేయడం లో మీకు మించిన వాళ్ళు లేరని, మూడు రోజుల పాటు జరిగే వ్యవసాయ అవగాహన సదస్సులో రైతులందరూ పాల్గొనాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి ,జిల్లా కలెక్టర్ మను చౌదరి,అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.





