హుస్నాబాద్ డివిజన్ నూతన ఏసిపి గా యస్. సదానందం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ నూతన ఏసిపి గా యస్. సదానందం సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. 1996 బ్యాచ్ చెందిన సదానందం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్సైగా, వరంగల్ పిటిసి, ఉట్నూర్, అదిలాబాద్ జిల్లాలో సీఐగా పనిచేయడం జరిగింది. అనంతరం ఏసీపీగా ప్రమోషన్ పొంది కరీంనగర్ ఇంటలిజెన్స్ లో రెండు సంవత్సరాలు పూర్తిచేసుకుని హుస్నాబాద్ ఏసిపి గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ ని కలసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ అభినందించి హుస్నాబాద్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని మరియు అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే పిడిఎస్ రైస్, ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, మత్తు పదార్థాల రహిత జిల్లాగా ఏర్పాటు చేయడానికి కృషి చేయాలన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తగు చర్యలు తీసుకోవాలని, దొంగతనాలు జరగకుండా విసబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలని తెలిపారు.





