ఉపాధి హామీ పనుల్లో ప్రమాదం..బండరాళ్లు మీద పడి తల్లి, కూతురు మృతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో ఉపాధి హామీ పనుల్లో ప్రమాదం జరిగి బండరాళ్లు మీద పడడం తో తల్లి, కూతురు దుర్మరణం పాలైన విషాద ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన కందారపు సరోజన (45) అన్నాజీ మమత (28) రోజు మాదిరిగానే మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకంలో భాగంగా కూలీ పనికి వెళ్లి మట్టిని తవ్వుతున్న క్రమంలోనే పైన ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లు సరోజన, మమత మీద పడిపోయి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఉపాధి కూలీలు రేణుక, స్వరూపలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకొని చనిపోయిన సరోజన, మమతలను బండరాళ్ల మధ్య నుంచి అతి కష్టం మీద బయటికు తీశారు. తీవ్రంగా గాయపడిన రేణుక, స్వరూపలను 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.