తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు కేసులో నిందితుడి అరెస్టు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పంటించిన ఘటనను అక్కన్నపేట పోలీసులు ఛేదించారు. ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు హుస్నాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాస్ కేసు వివరాలు తెలియపరుస్తూ అక్కన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌటపల్లి గ్రామంలోని బురుజు చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ముసుగు కప్పి ఉంచారని, ఆదివారం రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ముసుగును కాలబెట్టినాడని టిఆర్ఎస్ నాయకులు దరఖాస్తు ఇవ్వగా అక్కన్నపేట ఎస్ఐ విజయభాస్కర్, కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారని తెలిపారు. కేసు పరిశోధనలో భాగంగా టెక్నాలజీ ఉపయోగించి తెలంగాణ తల్లి విగ్రహం ముసుగుకు నిప్పు పెట్టిన నిందితుడు కామాద్రి రాంబాబు, తండ్రి రాజయ్య, వయస్సు 34 సంవత్సరంలు, గ్రామం చౌటపల్లి, మండలం అక్కన్నపేట అని, అతనిని చాకచక్యంగా పట్టుకొని మంగళవారం అరెస్టు చేయడం జరిగిందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.