సిద్దిపేట టైమ్స్, గజ్వేల్ ప్రతినిధి
డెంగ్యూతో ఏడో తరగతి చదువుతున్న బాలుడు మృతి చెందిన సంఘటన గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీ పల్లెపహాడ్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శివలింగు బన్నీ (13) అనే బాలుడు ఆర్ అండ్ ఆర్ కాలనీలోని ఏటీగడ్డ కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం అతడు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా రెండు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో కుటుంబీకులు బన్నీని గజ్వేల్లోని ఒక ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. బన్నీని పరీక్షించిన అక్కడి వైద్యులు డెంగ్యూగా నిర్దారించారు. మెరుగైన చికిత్స కోసం సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నప్రాయంలోనే తన కుమారుడు చనిపోవడంతో మృతుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుని తండ్రి శివలింగుకి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు సంతానం కాగా బన్నీ అందరికంటే చిన్న వాడు. బన్నీ మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న తోటి స్నేహితులు, బంధువులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.