హుస్నాబాద్ నియోజకవర్గ గిరిజన సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర SC,ST చైర్మన్ బక్కి వెంకటయ్య కు వినతి పత్రం ఇచ్చిన గిరిజన నేతలు
సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్: రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యూల్డ్ తెగల చైర్మన్ బక్కి వెంకటయ్య, సిద్దిపేట జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్, సిద్దిపేట పోలీస్ కమిషనర్, ఎస్టీ కార్పొరేషన్ మెంబర్స్, అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గిరిజన నేత బీజేపీ నాయకుడు గుగులోత్ తిరుపతి నాయక్ మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అక్కన్నపేట మండలంలో అనేక గిరిజన తండాలు ఉన్నాయన్నారు. తండాలకు సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు, గ్రామపంచాయతీ పరిధిలోని అనేక కార్యాలయాల నిర్మాణం పూర్తిస్థాయిలో జరగక ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన కస్తూరిబా గాంధీ హాస్టల్ పూర్తిస్థాయి నిర్మాణం జరగకపోవడం, హాస్టల్ వార్డెన్ ను నియమించక పోవడంతో ఆహార వసతులు, తరగతుల నిర్వహణ లోపం వలన విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా
హుస్నాబాద్ డివిజన్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన బంజారా భవన్ శ్రీ సేవాలాల్ మహారాజ్ భవనానికి సరైన నిధులు అందకపోవడం వలన నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. బంజారా భవన్ కు వెళ్ళే రోడ్డు మార్గం, అనేక సమస్యల ఇంకా పూర్తి చేయలేదన్నారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించి త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా గత ప్రభుత్వం హయాంలో సుమారు రెండు కోట్ల రూపాయలతో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వపరమైన అన్ని అనుమతులను, ప్రోసిడింగ్ కూడా పొందిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా భవన్ పనులను ఇంకా ఈ ప్రభుత్వం ప్రారంభించలేదన్నారు. అదేవిధంగా గిరిజనుల డిటిడబ్లుఓ ఆఫీస్ సంగారెడ్డి లో ఉండడం వలన సిద్దిపేట జిల్లాలోని గిరిజన ప్రజలకు చాలా దూరం కావడంతో పూర్తిస్థాయిలో కార్యాలయపు సౌకర్యాలను పొందడంలో పనులను చేసుకోవడంలో ఆలస్యం జరుగుతుందన్నారు. కావున డిటిడబ్లుఓ కార్యాలయాన్ని సిద్దిపేటలో ప్రారంభించి గిరిజన ప్రజలకు అందుబాటులో ఉండేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.