గ్రూప్స్1,2,3, డిఎస్సి ఉద్యోగాలను పెంచి పరీక్షలు నిర్వహించాలి
జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలి
హుస్నాబాద్ నియోజకవర్గ గిరిజన సంఘాల నాయకులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ 2 & 3, డీఎస్సీ ఉద్యోగాలను పెంచి పరీక్షలను నిర్వహించాలని, అలాగే గ్రూప్-1 పోస్టులను పెంచి 1:100 లో మెయిన్స్ కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన సంఘాల నాయకులు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయకుండా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తుందని గిరిజన నాయకులు ఆరోపించారు. విద్యార్థులు చదువుకోవడానికి సమయం ఇచ్చి గ్రూప్-2, డిఎస్సి పరీక్షల ను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన నిలువకుంటే నిరుద్యోగులందరం ఏకమై రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దే దించుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల సమితి జిల్లా అధ్యక్షుడు సత్యం నాయక్, లంబడి వేదిక జిల్లా అధ్యక్షుడు కృష్ణ నాయక్, గిరిజన సంఘ నేత భూక్య తిరుపతి నాయక్, లకపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.