గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఇంటర్నేషనల్ స్కూల్ లతో గురుకులాలు పోటీ పడాలి.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి
గురుకుల లో ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురండి – మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ నియోజకవర్గంలోని పోతారం గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ను రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అకస్మిక పర్యటన చేశారు. పాఠశాలలో పరిసరాలు మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో ఒక్కోక్కరితో ఆత్మీయంగా పలకరిస్తూ మాట్లాడారు. అదే సమయంలో విద్యార్థులకు డిన్నర్ సమయంలో భోజనం చేస్తుండడంతో వారితో కలిసి భోజనం చేశారు. ప్రతి రోజూ అన్నం, కూరలు ఎలా ఉన్నాయని, ఉదయం ఏ రోజు ఎలాంటి టిఫిన్ పెడుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మంత్రి కుటుంబ సభ్యులకు మొబైల్ వీడియో కాల్ లో పరిచయం చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అక్కడే ఉన్న ఉపాధ్యాయులతో సబ్జెక్టు ల వారీగా వారు బోధించే అంశాలపై మాట్లాడారు. గురుకులాలు ఇంటర్నేషనల్ స్కూల్ లతో పోటీ పడాలంటే ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా ఇంగ్లీష్ లో మాట్లాడాలని సూచించారు. అప్పుడే విద్యార్థులు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా మ్యాథ్స్ లో విద్యార్థులు వెనక బడకుండా ప్రత్యేక తరగతుల ద్వారా బేసిక్ నుండే వారికి నేర్పించాలని సూచించారు. ప్రతి రోజూ వారికి ఉండే ఆటల సమయాన్ని ఉపయోగించి వారికి ప్రత్యేకంగా ఆటల్లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. స్కూల్ కి గ్రౌండ్ చిన్నగా ఉన్న అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్కూల్ గ్రౌండ్ కోసం స్థల పరిశీలన చేసి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అధ్యాపక బృందం విద్యార్థులకు ప్రేమపూర్వకంగా, స్నేహ పూర్వకంగా మెలగాలని ఇప్పటి నుండే లక్ష్యాన్ని ఎంచుకొని సాధించేలా వారిలో పూర్తి నింపాలని సూచించారు.
స్కూల్ కి విద్యుత్ సమస్య లేకుండా చూసుకోవాలని ఆవరణలో లైట్స్ ఏర్పాటు చేయాలని, నాణ్యమైన డ్రింకింగ్ వాటర్ అందించాలని తెలిపారు. ప్రహరీ గోడ పై నుండి కుక్కలు వస్తుండడం తో దానికి ఫేన్సింగ్ వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.








