హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలం..
వరంగల్ లో రైతులకు ఇచ్చిన డిక్లరేషన్ ఏమైంది..
-మెదక్ ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేట టైమ్స్, దుబ్బాక ప్రతినిధి
అధికారం లోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ నేతలు కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన కాంగ్రెస్ హామీల అమలు ఏమైంది? డిసెంబర్ 9న రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు మ్యానిఫెస్టో మీద కూడా గౌరవం లేదు. తొలుత రుణమాఫీ అన్నారు. తొమ్మిది నెలలు కావొస్తున్నా రుణమాఫీ ఊసే లేదు. అభయహస్తం మ్యానిఫెస్టోలో వరి ధాన్యానికి రూ.2683 రూపాయల మద్దతు ధర ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది? డిసెంబర్ 9న రుణమాఫీ ఎందుకు చేయలేదు? ఇందిరమ్మ రైతు భరోసా ఎక్కడ? వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. ఏమైంది?
పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేస్తామని భువనగిరిలో లక్ష్మీ నరసింహస్వామి, మెదక్‌లో ఏడుపాయల దుర్గమ్మ మీద సీఎం రేవంత్ రెడ్డి ఒట్లు వేశారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పాలకులు టైం పాస్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అడుగులు తడబడుతున్నాయి. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యేనాటికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.