నిత్యం ప్రజా సేవలో ఉంటేనే అవకాశాలు వస్తుంటాయి
పదవి కాలం ఉగాది పచ్చడి లాగ తీపి, చేదుగా ఉంటుంది
రాజకీయాలకు అతీతంగా సమస్యలు పరిష్కరిద్దాం
మండల పరిషత్ ఆత్మీయ సత్కార కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

మండల ప్రజా పరిషత్ సభ్యుల 5 సంవత్సరాల పదవీకాలం ముగుస్తుండడంతో హుస్నాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో జరిగిన ఆత్మీయ సత్కార కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురు మామిడి, సైదాపూర్, కోహెడ మండల కేంద్రాల్లోనీ మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో ఎన్నికల వరకే రాజకీయాలు అని ఎన్నికల తర్వాత అభివృద్ధి ప్రజా సమస్యల్లో భాగస్వామ్యం కావడమే రాజకీయ నాయకుడి లక్ష్యమని తెలిపారు. పదవి కాలం పూర్తి చేసుకున్న ఎంపిపి, జడ్పీటీసీ, ఎంపిటిసి లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని పదవుల్లో ఎదగాలని కోరారు. రాజకీయాల్లో ఉండాలనుకునే వారు నిత్యం ప్రజా సేవలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలని సూచించారు. మాజీలు అయిన తరువాత కూడా గౌరవం దక్కేలా వ్యవహార శైలి ఉండాలనీ సూచించారు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదని అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలని సూచించారు. రాజకీయ జీవితంలో పూర్తి చేసిన పనులు చేయని పనులు ఉగాది పచ్చడి వలె తీపి, చెదులగా ఉండాలని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలు పరిష్కరిద్దామని సూచించారు. తమది నియంతృత్వం ప్రభుత్వం కాదని ప్రజా పాలన ద్వారా ప్రజా ప్రభుత్వాన్ని అందిస్తున్నామన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయం పైనే తన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.
తను nsui విద్యార్థి నాయకుడిగా, srr కాలేజి అధ్యక్షుడిగా, మార్క్ ఫెడ్ చైర్మన్ గా, సింగిల్ విండో చైర్మన్ గా, ఎంపిగా, ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రి గా కింది స్థాయి నుండి వచ్చానని గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి రాష్ట్రంలో మీ ఎమ్మెల్యే ఎవరు అంటే పొన్నం ప్రభాకర్ అనే విధంగా గౌరవం పెంచుతామని తెలిపారు. నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తిచేసి వ్యవసాయానికి నీళ్ళు అందించడమే తన లక్ష్యం అన్నారు. కాలువలకు జరుగుతున్న సర్వేలో రైతులు సహకరించాలని కోరారు.
అటు ఆత్మీయ సత్కారం తో పాటు కోహెడ ,చిగురు మామిడి మండలాల సర్వసభ్య సమావేశంలో పాల్గొని మండల అభివృద్ధి రోడ్లు, విద్యా, వైద్యం, వ్యవసాయం, విద్యుత్ తదితర అంశాలపై అధికారులను ఆరా తీశారు. చిగురు మామిడి మండలంలో జాతీయ చిహ్నం స్థూపాన్ని ఆవిష్కరించారు. వీటితో పాటు సైదాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యక్రమంలో వన మహోత్సవం లో పాల్గొని అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
ఆత్మీయ సమావేశాల్లో కోహెడ, చిగురు మామిడి, వె. సైదాపూర్ మండల ఎంపిపి లు, జడ్పీటిసి లు, ఎంపిటిసి లు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
