హుస్నాబాద్ లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్: 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో హుస్నాబాద్ ఎమ్మెల్యే, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో అమరులైన తర్వాత స్వాతంత్రం సాధించుకున్నాం, వారు తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి దేశం కోసం పోరాడారని, వారందరికీ మనం రుణపడి ఉంటామన్నారు. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది అని అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యత గల పౌరులుగా దేశం కోసం, సమాజం కోసం పని చేయాలని పిలుపు నిచ్చారు.
10 సంవత్సరాల రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఈరోజు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు పోతుంది. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, మనకున్న హక్కులకు, స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఉండడానికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలన్నారు. రాష్ట్ర, దేశ ప్రగతికి ప్రజలంతా కృషి చేయాలన్నారు. స్వాతంత్ర ఫలాలు క్షేత్రస్థాయిలో అందరికీ అందాలని, అందుకు అందరి భాగస్వామ్యం కావాలన్నారు.
అనంతరం హుస్నాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, నెహ్రు చౌరస్తాలో మరియు గాంధీ చౌరస్తాలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తారి రవీందర్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ కమిషనర్ మల్లికార్జున్, నాయకులు, పట్టణ ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.