42 శాతం బిసి రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి
బహుజనులంతా ఏకమై సంఘటితంగా పోరాడాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి కి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కి విన్నపం
రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్
సిద్దిపేట టైమ్స్ డెస్క్
తెలంగాణలో గ్రామీణ, పుర, నగర పాలక స్థానిక సంస్థలలో 42 శాతం బిసి రిజర్వేషన్ కల్పనకు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీని సాధించుకోవడానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్న అన్ని స్థాయిల్లోని బిసి లు సంఘటితంగా నినదించాల్సిన సమయం
ఆసన్నమైనదని, ఆదమరిస్తే, ఏమరుపాటుకు గురవుతే, మన బిసి పునాదులు దెబ్బతింటాయి రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్ భాస్కర్ అన్నారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వం తప్పుడు నిర్ణయం వల్ల బిసిలకు భారీ అన్యాయం జరిగింది అని అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు కొరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి మరియు సంబంధిత శాఖ మంత్రులకు వినతి పత్రం సమర్పించారు.
శాసన సభ ఎన్నికలకు ముందు, స్థానిక సంస్థలలో 42శాతం బిసి రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఎన్నికల ప్రమాణం చేశారు. దానికోసం తెలంగాణ వెనుకబడిన తరగతుల (బిసి) బహుజన ప్రజానీకం, ఆశావహులు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల విశ్వాసంతో ఎదురుచూస్తున్నారు.
పాలనా అడ్డుగా ఉండకుండా, వీలయినంత తొందరగా సర్పంచు, ఇత్యాది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని మీరు ఆకాంక్షింస్తున్నట్లు తెలుస్తున్నది. మీ ఆలోచన సరైనదే. కానీ, 42శాతం బిసి రిజర్వేషన్ ప్రకటించి, ఆ మేరకు స్థానాలను బిసిలకు నిర్ధారించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని, తద్వారా గత అయిదేళ్లుగా బిసిలకు జరిగిన భారీ అన్యాయం జరగకుండా చూసి, కామారెడ్డి డిక్లరేషన్ రూపంలోని మీ ఎన్నికల ప్రమాణం నిలుపుకోవాలని తెలంగాణ బిసి సమాజం పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
