అమరుల కుటుంబాలకు 25 వేల పెన్షన్, ఉద్యమకారులకు 250 గజాల స్థలం: మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..తెలంగాణ ఆవిర్భావం జరిగి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు వందనాలు తెలియజేశారు.
తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ 12 వ ఆవిర్భావ దినోత్సవం లోపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా అమరవీరుల కుటుంబాలకు 25 వేల పెన్షన్ , తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, మేనిఫెస్టో లో చెప్పిన విధంగా వారిని గౌరవించుకుంటాం అని అన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తి మేరకే తెలంగాణ ఏర్పడిందన్న భావాన్ని ఎక్కడా వదిలిపెట్టకుండా ముందుకు తీసుకుపోతాం అని, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆకాంక్ష, ఆత్మగౌరవానికి సంబంధించిన ఎజెండా..ఆ ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రజలకు ఇబ్బంది లేకుండా భవిష్యత్ పరిపాలన కొనసాగిస్తూ ప్రజా పాలన ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ పక్షాన తెలియజేస్తున్నా అని అన్నారు.
మరోసారి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతు….ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరవేసే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని..ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్తే ప్రభుత్వం వినడానికి సిద్దంగా ఉంటుందని అన్నారు.
ఇది ప్రజా పాలన, ప్రజల ప్రభుత్వం. నిరంకుశత్వంగా నిర్ణయం తీసుకునేది కాదు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని నడిపేది కాంగ్రెస్ ప్రభుత్వం. సరైన మార్గదర్శకత్వం మాకు తెలంగాణ సమాజం నుండి ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.